ఇండస్ట్రీలో బయోపిక్స్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే పలువురు సినీ, క్రీడా,రాజకీయ ప్రముఖుల జీవితాలకు సంబంధించిన బయోపిక్స్ రూపొందాయి. ఇందులో క్రీడాకారుల బయోపిక్‌లకు ఎనలేని ఆదరణ ఉంది. ముఖ్యంగా క్రికెటర్స్ బయోపిక్స్‌కి సంబంధించిన చిత్రాలు రిలీజ్ అయితే అవి సూపర్ హిట్ కావడం ఖాయం.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, కపిల్ దేవ్ల నిజ జీవితాల ఆధారంగా చిత్రాలు తెరకెక్కాయి. ఇప్పుడు మాజీ క్రికెటర్ బయోపిక్‌కి సంబంధించి రంగం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్.. నిజ జీవితంలో పోరాడి గెలిచిన యువరాజ్ సింగ్ బయోపిక్ రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే యువీతో చర్చలు కూడా జరిపారని టాక్.
యువీ ప్రతిపాదించిన ఇద్దరు స్టార్ హీరోలను కాదని కరణ్.. కొత్త ముఖం వైపు మొగ్గు చూపుతున్నాడని సమాచారం. యువీ గతంలో హృతిక్ రోషన్, రణ్‌బీర్ కపూర్‌లలో ఎవరో ఒకరు తన బయోపిక్‌లో నటిస్తే బాగుంటుందని చెప్పినప్పటికీ.. కరణ్ కొత్త కుర్రాడు సిద్ధార్థ్ చతుర్వేదిని పరిచయం చేయాలని భావిస్తున్నాడని తెలుస్తోంది. కాగా, గంగూలీ బయోపిక్ కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న విషయం తెలిసిందే.