పవన్ కళ్యాణ్, అలీ.. ఈ ఇద్దరూ ఎంత మంచి స్నేహితులు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు పాతికేళ్లకు పైగానే ఉండే స్నేహం వీళ్లది. పవన్ సినిమాల్లోకి రాకముందు నుంచి కూడా అలీతో పవన్‌కు పరిచయం ఉంది. ఆ తర్వాత పవర్ స్టార్ హీరో అయిన తర్వాత మొదటి రెండు మూడు సినిమాలు మిస్ అయ్యాడు కానీ ఆ తర్వాత మాత్రం అన్ని సినిమాల్లో ఉన్నాడు. మధ్యలో ఒకట్రెండు సినిమాలు మినహాయిస్తే పవన్ నటించిన ప్రతీ సినిమాలో అలీ కనిపించాల్సిందే. ఆయన లేకపోతే తనకు సినిమా చేసిన ఫీల్ కూడా ఉండదని అప్పట్లో తీన్మార్ ఆడియో వేడుకలో చెప్పాడు పవర్ స్టార్. దాన్నిబట్టి పవన్‌తో అలీకి ఉన్న రిలేషన్ గురించి అర్థం అయిపోతుంది. ఈ ఇద్దరూ నటుల కంటే కూడా అంతకుమించి మంచి స్నేహితులు. ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలిసిన స్నేహితులు. అలాంటి ఫ్రెండ్స్ మధ్య కొన్ని రోజుల కింద రాజకీయాలు చిచ్చు పెట్టాయి. జనసేన కాకుండా మరో పార్టీలో చేరిన అలీపై అప్పట్లో పవన్ కొన్ని సంచలన కామెంట్స్ చేసాడు. దానిపై అలీ కూడా సీరియస్‌గానే స్పందించాడు.
అప్పట్నుంచి ఇద్దరి మధ్య పెద్దగా మాటలు లేవు. బయట కనిపించింది కూడా లేదు. దాంతో పవన్‌తో అలీ పూర్తిగా విడిపోయాడు అనే ప్రచారం కూడా జోరుగానే జరిగింది. అయితే ఈ ఇద్దరూ మాత్రం ఎప్పుడూ ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకుంటూనే మాట్లాడారు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్లీ తెలిసిన వాళ్ల పెళ్లిలో కలిసారు. ఈ ఫోటో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్, అలీ కలిసి నవ్వుతూ పోజులిచ్చారు. దాంతో ఈ ఇద్దరూ కలిసి నటించడం ఖాయం అయిపోయిందంటున్నారు అభిమానులు.
త్వరలోనే ఈ కాంబినేషన్‌ను మళ్లీ తెరపై చూడొచ్చని నమ్ముతున్నారు. ఈ మధ్య పవన్ నటించిన కొన్ని సినిమాలు అలీ మిస్ అయ్యాడు. దానికి తెరవెనక కారణాలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు అవన్నీ సమసిపోయి మళ్లీ కలిసి నటిస్తారని నమ్ముతున్నారు అభిమానులు. పవన్ ప్రస్తుతం వకీల్ సాబ్, అయ్యప్పునుమ్ కోషియుమ్, క్రిష్ సినిమా, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి వీటిలో ఎన్ని సినిమాలలో అలీకి అవకాశాలు వస్తాయో చూడాలి.