‘సింహా’, ‘లెజెండ్’ లాంటి భారీ విజయాల తర్వాత మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను, నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి నిన్న మొన్న వచ్చిన టీజర్ వరకూ ప్రతిదీ సెన్సేషనే. ప్రస్తుతం అన్నపూర్ణ ఏడెకరాల్లో షూటింగ్ విజయవంతగా జరుగుతోంది. 30 లక్షల రూపాయిలతో నిర్మించిన భారీ టెంపుల్ సెట్లో గత నాలుగైదు రోజులుగా కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇంకో రెండు వారాల పాటు ఇక్కడే షూటింగ్ జరుగుతోందని టాక్. ఇదిలా ఉంటే.. సినిమా రిలీజ్ ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ అదరహో అనిపిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సొంతం చేసుకున్నారని ప్రచారం జరగ్గా.. తాజాగా ఓవర్సీస్తో పాటు అన్ని విషయాలపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఓవర్సీస్లో ‘బీబీ 3’ థియేట్రికల్ రైట్స్ రూ.2 కోట్లకు అమ్ముడుపోయాయి. రెండు కోట్లు అంటే మామూలు విషయమేం కాదు.. భారీ ధరకే అమ్ముడుపోయాయని చెప్పుకోవచ్చు. సాధారణంగా బాలయ్య సినిమాలకు ఓవర్ సీస్లో పెద్దగా క్రేజ్ ఉండవనే టాక్ ఉంది. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో మంచి ఆఫర్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం ఆశించింనంతగా రాలేదు. అయితే.. ‘బీబీ3’ రైట్స్ రెండు కోట్లకు అంటే బాలయ్యకు ఇప్పుడున్న పరిస్థితుల్లో గొప్పే అని చెప్పుకోవాలి.
ఇదిలా ఉంటే.. ఆంధ్రా రైట్స్ ఇప్పటికే రూ.35 కోట్లు పలకినట్లు.. నైజాం, ఉత్తరాంధ్ర రైట్స్‌ను రూ. 16 కోట్లకు దిల్‌రాజు దక్కించుకున్నాడని గత నాలుగైదు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ముచ్చటగా ఈ కాంబోలో వస్తున్న మూడో సినిమా తప్పకుండా హ్యాట్రిక్ కొడుతుందని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఇలా రోజురోజుకో అప్డేట్ వస్తున్న ఈ చిత్రంపై భారీగానే అంచనాలున్నాయ్. ఎప్పటిలానే బోయపాటి కాంబోలో ఈ సినిమాలో కూడా బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు వార్తలు వస్తుండటంతో అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు.
కాగా.. ఇప్పటి వరకూ రెండు పాటలకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యిందని సమాచారం. అయితే ఇంకో పాటకు మాత్రమే షూటింగ్ చేయాల్సి ఉందట. బాలయ్య 106వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ఫిక్స్ అయిందని టాక్ నడుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. తమన్ స్వరకర్తగా.. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ కథానాయికలుగా నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య మే-28న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా హ్యాట్రిక్ కొడుతుందో లేదో వేచి చూడాలి.