ఎన్టీఆర్ లాంటి భారీ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సినిమాలకు టెక్నీషియన్స్ ఎంపిక చిన్న విషయమేమీ కాదు. అందుకే దర్శక, నిర్మాతలు ఒకటికి పదిసార్లు లెక్కలేసి మరీ ఎంపిక చేసుకుంటారు. అసలే సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అంటే అంచనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి కనుక టెక్నీషియన్స్ ను కూడా అల్రెడీలో ఫామ్ లో ఉన్న వారినే ఎంచుకుంటారు. కాగా.. తమిళంలో భారీ క్రేజీ ప్రాజెక్టులను దక్కించుకునే యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తెలుగులో ఇంకా సక్సెస్ ఫుల్ అనిపించుకోలేకపోతున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి క్రేజీ కాంబినేషన్ అజ్ఞాతవాసి సినిమాతో తెలుగులో మంచి అవకాశాన్ని పట్టినా అనిరుధ్ కి అది ఇక్కడ అంతగా కలిసిరాలేదు. అయితే.. తమిళంలో మాత్రం భారీ ప్రాజెక్టులను దక్కించుకోవడంతో పాటు అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. కాగా, ఇప్పుడు మరోసారి తెలుగులో మరో భారీ అవకాశాన్ని పట్టినట్లుగా ప్రచారం జరుగుతుంది. అదే ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా.
ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం థమన్, దేవిశ్రీ, మణిశర్మ లాంటి వారు సంగీతాన్ని అందించనున్నారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా అనిరుధ్ పేరు వినిపిస్తుంది. నిజానికి అనిరుధ్ ఎన్టీఆర్ అరవింద సామెతకి పనిచేయాల్సింది. కానీ.. అప్పుడు అది కుదరలేదు. కానీ ఈసారి మాత్రం కొరటాల శివ సినిమాకు అనిరుధ్ పనిచేయడం గ్యారంటీ అంటున్నారు.
అనిరుధ్ కూడా తెలుగులో సక్సెస్ కావాలని కసితో ఉన్నాడు. జెర్సీ సినిమాకు సంగీతంతో ప్లస్ అయినా కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. దీంతో ఎన్టీఆర్-కొరటాల లాంటి సినిమాకు మ్యూజిక్ సెట్ అయితే తెలుగులో కూడా తన కెరీర్ గాడినపడ్డట్లేనని అనుకోవచ్చు. అందుకే ఒక్క అవకాశం చూస్తున్న అనిరుధ్ కు ఇప్పుడు ఎన్టీఆర్ 30వ సినిమా ఒక మార్గంగా మారినట్లుగా కనిపిస్తుంది. అయితే.. ఇప్పటి వరకు దీనిపై ఎక్కడా అధికారిక ప్రకటన లేదు. కనుక ఇదే ఫిక్స్ అనుకొనే అవకాశం కూడా లేదు. ఏమైనా మార్పులు ఉంటాయా అన్నది చూడాల్సి ఉంది.