మహారాష్ట్ర : గత కొద్ది సంవత్సరాలుగా నగరాలు గ్రామాలు తేడాలేకుండా, ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు, బానర్లు తగిలించడం సర్వసాధారణంగా మారిపోయింది. పెళ్ళిళ్ళకి, పుట్టినరోజు లకి, అభిమాన హీరో సినిమా రిలీజ్ లకి, రాజకీయ నాయకులకు స్వాగతం పలికే ఫ్లెక్సీలు ఇంకా మరెన్నో చిన్న చిన్న సందర్భాలకు కూడా బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టేయటం ఆనవాయితి మారిపోయింది.
ఈ మధ్యకాలంలో బ్యానర్లు, ఫ్లెక్సీల గోల ఎక్కువైపోయింది. డివైటర్లకు, హోర్డింగ్ లకే కాకుండా చెట్లకు, పుట్లకు, గోడలకు ఇలా ఎక్కడపడితే అక్కడ బ్యానర్లు ప్రత్యక్షమవుతున్నాయి. మహారాష్ట్రలోని బీద్ జిల్లా అంబేజోగాయ్ ప్రాంతంలో వీధుల్లోని భవనాలు, చెట్లపై రకరకాల బ్యానర్లు, ఫ్లెక్సీలు భారీ సంఖ్యలో ముంచెత్తడంపై చిర్రెత్తుకొచ్చిన అక్కడి ప్రజలు వెరైటీగా నిరసన తెలిపారు.
తమ ఊర్లోని కుక్కలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్లు కట్టారు. దీంతో ఈ విషయంకాస్తా పోలీసుల వద్దకెళ్లింది. దీంతో సదరు బ్యానర్ కట్టినవారిని పిలిచి వివరణ అడిగారు. దానికి వారు చెప్పిన సమాధానం విని పోలీసులు కూడా సరైందే అని సమ్మతించారు.
అయితే కొందరు స్థానికులు కుక్కల పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ కట్టిన బ్యానర్లను వెంటనే తొలగించి, ఇకనుంచి బ్యానర్లు ఎక్కడపడితే అక్కడ కట్టకూడదని చుట్టుపక్కల వాళ్ళకి ఆదేశించారు. మొత్తంగా ఈ సంఘటనలో ఎటువంటి గొడవలు గాని వాగ్వాదాలు గాని జరగలేదని పోలీసులు వెల్లడించారు.