తెలుగు సినీ ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రాల్లో ‘టక్ జగదీశ్’ ఒకటి. నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శివ నిర్వాణ దర్శకుడు. ఈ సినిమా కోసం మొదటిసారి దర్శకుడు శివ గొంతు సవరించుకున్నారు. సినిమాలో నాని పాత్రను తెలియజేసేలా రూపొందించిన ‘సల్లాటి కుండలో.. సల్ల సక్క మనసువాడు’ పాటను ఆయన ఆలపించారు. రాయలసీమ యాసలో సాగే ఈ పాటను చిత్రబృందం శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేసింది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా విడుదల కానుంది.
‘నిన్నుకోరి’ తర్వాత నాని-శివ నిర్వాణ కాంబినేషన్లో వస్తోన్న రెండో సినిమా ఇది. భూ తగాదాలు.. కుటుంబ విలువలు ప్రధానాంశంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. నాజర్, జగపతిబాబు, నరేశ్, రావురమేశ్ కీలకపాత్రలు పోషించారు. రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్ కథానాయికలు. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్ స్వరాలు అందించారు. కాగా, తాజాగా విడుదలైన ఈ పాటకు గోపీసుందర్ స్వరాలు అందించారు.