ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా అగ్ర కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్ ఓ శుభవార్తను పంచుకుంది. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో తాను ప్రేమలో ఉన్నట్లు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. ‘థాంక్యూ మై లవ్.. ఈ ఏడాది నేను అందుకున్న అతిగొప్ప బహుమతి నువ్వే. నా జీవితాన్ని రంగులమయం చేసినందుకు, అనునిత్యం నా మోముపై నవ్వుల్ని విరబూయించినందుకు కృతజ్ఞతలు. ఇకపై మనిద్దరం కలిసి మరిన్ని మధురానుభూతుల్ని జత చేసుకుందాం’ అని వ్యాఖ్యానించింది రకుల్‌ప్రీత్‌సింగ్. ప్రియుడితో కలిసి తీయించుకున్న ఓ ఫొటోను షేర్ చేసింది. రకుల్‌ప్రీత్‌సింగ్‌కు జన్మదిన శుభాకాంక్షలందజేస్తూ జాకీ భగ్నానీ కూడా ఓ పోస్ట్ చేశారు. ‘నా సర్వస్వం నువ్వే. ఈ ప్రపంచంలోనే అందమైన హృదయం కలిగిన అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ లవ్సింబల్ను జోడించి విష్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత వశు భగ్నానీ కుమారుడే జాకీ భగ్నానీ. న్యూయార్క్‌లో యాక్టింగ్ కోర్సును అభ్యసించాడు. ‘కల్ కిస్నే దేఖా” చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమయ్యాడు.